Khammam: పొలాన్ని ఆక్రమించుకున్నారని.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఓ రైతు ఆత్మహత్య సంచలనంగా మారింది.
By అంజి Published on 2 July 2024 2:15 PM ISTKhammam: పొలాన్ని ఆక్రమించుకున్నారని.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఓ రైతు ఆత్మహత్య సంచలనంగా మారింది. రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తన పొలం ఆక్రమించుకొని తనకు అన్యాయం చేశారని రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ''నేను చనిపోతున్న.. నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. డిప్యూటీ సీఎం భట్టికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి'' అంటూ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆత్మహత్యకు ముందు మాట్లాడిన వీడియోలో రైతు పేర్కొన్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే, టైమ్ అయిపోయిందని చెప్పారని వాపోయాడు.
తనకు మరో మార్గం లేక చనిపోతున్నానని తనకున్న ఏడెకరాల పొలంలో మూడెకరాల పది కుంటల పొలాన్ని ఆక్రమించి ధ్వంసం చేశారని వాపోయాడు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి సదరు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.