విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ అభిమాని మృతి
Fan Dies of heart attack while watching RRR movie in Anantapuram. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్
By తోట వంశీ కుమార్ Published on 25 March 2022 9:37 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)'. దర్శదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే బెన్‌ఫిట్ షోలు పూర్తి అయ్యాయి. సినిమా అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. సినిమా చూసేందుకు వెలుతూ రోడ్డు ప్రమాదం ముగ్గురు, సినిమా చూస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్వీమ్యాక్స్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం బెనిఫిట్ షో చూస్తుండగా.. ఓబులేసుకు(30) అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ కుప్పకూలి పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు..
ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో చూసేందుకు వెలుతూ ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వీకోట మండలం బంగ్లా గ్రామం తుపాకీ వాండ్ల పల్లి కి చెందిన దుర్గ(25), వినయ్‌కుమార్(26) , గంగాధర్(24) లు ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసేందుకు వీరితో పాటు మరో యువకుడు రెండు బైక్‌లపై తమిళనాడులోని పేర్నమ్ బట్టు నుంచి వి.కోటకు వస్తుండగా పాపేపల్లి వద్ద అదుపు తప్పి రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దుర్గ అక్కడికక్కడే మృతి చెందగా.. గంగాధర్, వినయ్‌కుమార్‌లతో పాటు మరో యువకుడు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర్, వినయ్‌కుమార్ లు మరణించగా.. మరో యువకుడు కుప్పం పీఈఎస్‌లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.