వ్యాపారంలో నష్టాలు.. ఇంట్లో భర్త, చెరువులో దూకి భార్యాపిల్లలు ఆత్మహత్య
Family of Four Commits Suicide in Sangareddy District.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్య భర్తల మధ్య
By తోట వంశీ కుమార్
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆ దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్(38), లావణ్య(32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్(8), ప్రజ్క్ష(3) సంతానం. చంద్రకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బీహెచ్ఈఎల్‌లో స్థిరపడ్డారు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో చంద్రకాంత్, లావణ్యల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఈ విషయమై మరోసారి గొడవ జరిగింది. కోపంతో లావణ్య ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది.
వ్యాపారంలో నష్టాలు రావడం, భార్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన చంద్రకాంత్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న లావణ్య.. ఆందోల్ పెద్ద చెరువులో ఇద్దరుపిల్లలతో కలిసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.