ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. కోమాలో ఉన్నాడని చెబుతూ
Family keeps corpse of man who died a year ago and claims he was in coma.ఏడాదిన్నరక్రితం చనిపోయిన వ్యక్తి మృతదేహానికి
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2022 8:40 AM ISTఏడాదిన్నర క్రితం చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచుకుంది అతడి కుటుంబం. పైగా కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతున్నారు. చివరికి విషయం బయటకు రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టాలని కోరగా అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. చివరకు మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్‌లోని రోషన్ నగర్ నగర్ ప్రాంతంలో విమలేశ్(38) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన ఆదాయపన్ను శాఖలో పనిచేసేవారు. గతేడాది అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 22న మరణించాడు. వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. విమలేశ్ స్పృహలోకి వచ్చాడని కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న అందరికీ చెప్పారు. కోమాలోకి వెళ్లాడని చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి బెడ్‌పై ఉంచారు.
కాగా.. ఇటీవల విమలేశ్ భార్య మిథాలీ పింఛను కోసం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నరగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుందన్న సమాచారంతో ఆరోగ్యశాఖ అధికారుల బృందం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆయన కోమాలోకి వెళ్లాడని, బతికే ఉన్నాడని వాగ్వివాదానికి దిగారు. చివరకు అధికారులు కుటుంబ సభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని బట్టతో గట్టిగా చుట్టి 'మమ్మీ'లా మార్చారని వైద్యులు తెలిపారు.
ఇప్పటికి బతికే ఉన్నాడంటున్న తండ్రి
విమలేశ్ తండ్రి మాట్లాడుతూ.. విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతుంటే గతేడాది ఏప్రిల్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లాం. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటికి తీసుకొచ్చాక ఆయన గుండె కొట్టుకుంటుండడంతో బతికే ఉన్నాడని భావించి అంత్యక్రియలు నిర్వహించలేదన్నాడు. అంతేకాదండోయ్.. ఇప్పటికి అతడు బతికే ఉన్నాడని చెబుతున్నాడు.