హైదరాబాద్‌లో ఫేక్‌ వెహికల్‌ ఇన్సూరెన్స్‌ ముఠా.. 9 మంది అరెస్ట్‌.. నకిలీ పాలసీల స్వాధీనం

ప్రముఖ బీమా కంపెనీల పేరుతో నకిలీ పాలసీలను సృష్టించి, తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ఇస్తామని నమ్మబలికి వాహనదారులను...

By -  అంజి
Published on : 1 March 2026 1:30 PM IST

Hyderabad Police, Jeedimetla Racket, Fake Insurance Policies, Vehicle Insurance Fraud, Reliance General Insurance, NLB Nagar Raids, Cyber Crime Hyderabad

హైదరాబాద్‌లో ఫేక్‌ వెహికల్‌ ఇన్సూరెన్స్‌ ముఠా.. 9 మంది అరెస్ట్‌.. నకిలీ పాలసీల స్వాధీనం

హైదరాబాద్‌: ప్రముఖ బీమా కంపెనీల పేరుతో నకిలీ పాలసీలను సృష్టించి, తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ఇస్తామని నమ్మబలికి వాహనదారులను ముంచుతున్న 9 మంది సభ్యుల ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి మృణాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ (NLB) నగర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు తమ కంపెనీ పేరుతో నకిలీ పత్రాలు విక్రయిస్తున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఫిబ్రవరి 27న ఎన్ఎల్బీ నగర్‌లో మెరుపు దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రఘుల రవి, శివకుమార్, ఎస్. కుర్తి మాణిక్యరావు, కొత్త బాబురావు, రఘుల మహేష్, తడకల గిరిధర్ గౌడ్, మోరా నరసింహ, కుందుంగరి నాగరాజు, జెర్పుల కిషన్ అనే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఈ ముఠా అనుసరిస్తున్న విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోయి, అర్జంటుగా రెన్యూవల్ చేసుకోవాల్సిన వాహనదారులనే ఈ ముఠా టార్గెట్ చేసేది. ప్రముఖ కంపెనీల పాలసీలనే చాలా తక్కువ ప్రీమియంతో ఇస్తామని ఆశ చూపే వారు. నిందితుల వద్ద నుంచి భారీ సంఖ్యలో నకిలీ బీమా పాలసీలు, నకిలీ స్టాంపులు, ఫోర్జరీ పత్రాలను తయారు చేసే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక - ప్రజలకు సూచనలు:

నకిలీ ఇన్సూరెన్స్ వల్ల డబ్బులు పోవడమే కాకుండా, ప్రమాదాలు జరిగినప్పుడు క్లెయిమ్ రాదని, పైగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను కేవలం కంపెనీ అధికారిక వెబ్‌సైట్లు లేదా గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే తీసుకోవాలని సూచించారు. డబ్బులు చెల్లించే ముందే పాలసీ క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి లేదా వెబ్‌సైట్‌లో పాలసీ నంబర్‌ను వెరిఫై చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story