హైద‌రాబాద్‌లో న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బులు త‌యారీ కలకలం

తాజాగా హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ కంపెనీ మైసూర్ శాండిల్ పేరుతో కల్తీ సబ్బులను తయారు చేస్తున్న ముఠా పోలీసుల చేతికి చిక్కింది.

By అంజి  Published on  14 Jan 2024 7:32 AM GMT
Fake Mysore sandal soaps, manufacture, Hyderabad , KSDL

హైద‌రాబాద్‌లో న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బులు త‌యారీ కలకలం

ప్రస్తుత రోజుల్లో ఏది కల్తీనో.. ఏది కాదో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుండి ఐస్ క్రీములు కేకులు, నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, సబ్బులు సైతం ఇలా అన్నీ కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ కల్తీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది కేటు గాళ్లు మార్కెట్లో ఏది బాగా అమ్ముడుపోతుందో ఆ ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించుకుని కల్తీ పదార్థాలను వాటి పేరుతో తయారు చేసి దర్జాగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ కంపెనీ పేరుతో కల్తీ సబ్బులను తయారు చేస్తున్న ముఠా పోలీసుల చేతికి చిక్కింది.

హైదరాబాద్ నగరంలో మైసూర్ శాండిల్ బ్రాండ్ పేరును వాడుకొని ఇద్దరు కేటుగాళ్లు నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు రెండు కోట్ల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో మైసూర్ శాండిల్ సబ్బుల పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నారన్న విశ్వసనీయమైన సమాచారం అందుకున్న కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కే ఎస్ డి ఎల్ చైర్మన్ ఎంబీ పాటిల్ వెంటనే స్పందించి ఈ విషయాన్ని పరిశీలించాలని కె ఎస్ డి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతను ఆదేశించారు. దీంతో కేఎస్ డిఎల్ బృందం రంగంలోకి దిగి నకిలీ సబ్బులు అమ్ముతున్న ముఠాను గుర్తించారు. లక్ష రూపాయల విలువైన నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. అనంతరం తయారీ యూనిట్ ఎక్కడుందో కూపీ లాగి తెలంగాణ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట్ పోలీసులు తాజాగా దాడులు చేసి నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ముఠా వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.

రాకేష్ జైన్, మహావీర్ జైన్ ఈ ఇద్దరు నిందితులు కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ మైసూర్ శాండిల్ సబ్బు బ్రాండ్ ను వాడుకొని ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలతో నకిలీ సబ్బులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మలక్‌పేట్ పోలీసులు.. ఇద్దరు నిందిత వ్యక్తులను అరెస్టు చేసి 150 గ్రాముల మైసూర్ శాండిల్ 1800 సబ్బు ప్యాకెట్లు, 9400 కల్తీ సబ్బులు (75 గ్రాములు) తో కూడిన 47 పెట్టలు తయారీ మెటీరియల్స్ దాదాపు రూ.2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story