నగరంలో నకిలీ డెంటల్ డాక్టర్ గుట్టురట్టు..20 ఏళ్లుగా రాత్రి వేళల్లోనే చికిత్స!

20 ఏళ్ల పాటు డెంటల్ డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా మోసగాడిని మల్కాజ్‌గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు.

By -  Knakam Karthik
Published on : 24 March 2026 9:40 PM IST

Hyderbad News, Crime News, FakeDoctor, Dental Scam, Doctor Drama

నగరంలో నకిలీ డెంటల్ డాక్టర్ గుట్టురట్టు..20 ఏళ్లుగా రాత్రి వేళల్లోనే చికిత్స!

హైదరాబాద్: చదువుకున్నది పదో తరగతి లోపే.. కానీ ఏకంగా 20 ఏళ్ల పాటు డెంటల్ డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా మోసగాడిని మల్కాజ్‌గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్, రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నేరేడ్‌మెట్ పరిసరాల్లో స్థిరపడ్డాడు. డాక్టర్ కావాలనే పిచ్చితో బీడీఎస్ (BDS) చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, ఒక డెంటల్ క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

అయితే, రమేష్ క్లినిక్ నిర్వహించే తీరు పోలీసులకు అనుమానం కలిగించింది. అతను కేవలం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే చికిత్సలు చేస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. మల్కాజ్‌గిరి ఎస్ఓటీ బృందం క్లినిక్‌పై మెరుపు దాడి చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కనీసం పదో తరగతి కూడా పూర్తి చేయలేదని, కేవలం నకిలీ పత్రాలతోనే ఇన్నాళ్లూ డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడని దర్యాప్తులో తేలింది. 20 ఏళ్లుగా కళ్లుగప్పి వైద్యం చేస్తున్న ఈ నకిలీ డాక్టర్ ఉదంతం స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story