బాణాసంచా త‌యారీ క‌ర్మాగారాల్లో పేలుళ్లు.. ఏపీలో ముగ్గురు, త‌మిళ‌నాడులో 5గురు మృతి

Explosions in fireworks manufacturing factories 8dead.ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళ‌నాడు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 2:45 AM GMT
బాణాసంచా త‌యారీ క‌ర్మాగారాల్లో పేలుళ్లు.. ఏపీలో ముగ్గురు, త‌మిళ‌నాడులో 5గురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళ‌నాడు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుంది. బాణా సంచా త‌యారీ క‌ర్మాగారాల్లో పేలుళ్లు సంభ‌వించి మొత్తం ఎనిమిది మంది మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయప‌డ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో..

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం మండ‌లం క‌డియ‌ద్ద గ్రామంలో గురువారం రాత్రి బాణా సంచా త‌యారీ కేంద్రంలో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా మ‌రొక‌రు ఆస్ప‌త్రికి తీసుకువెలుతుండ‌గా ప్రాణాలు కోల్పోయారు. మ‌రో వ్య‌క్తి తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి మృతుల శ‌రీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. మొండెం ఓ చోట‌, కాళ్లు, చేతులు మ‌రో చోట ప‌డ్డాయి.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ కేంద్రం నిర్వాహ‌కుడిగా చెబుతున్న అన్న‌వ‌రం పండూరి ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఏలూరు రేంజ్ డీఐజీ పాల‌రాజు, ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మ ఘ‌ట‌నాస్థ‌లాన్ని సంద‌ర్శించారు.

సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి..

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంత్రిని వ్య‌క్తం చేశారు. మృతుల‌ కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు ఉచిత వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

త‌మిళ‌నాడులో...

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని మ‌ధురైలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. మ‌ధురై జిల్లా తిరుమంగ‌ళం స‌మీపంలోని అజ‌గుసిరై గ్రామంలోని బాణా సంచా త‌యారీ కేంద్రంలో పేలుడు సంభ‌వించి ఐదుగురు మ‌ర‌ణించారు. మ‌రో ప‌ది మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వీరిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో క‌ర్మాగారంలో 15 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి స్టాలిన్ సంతాపం..

సీఎం స్టాలిన్ సంతాపం వ్య‌క్తం చేస్తూ.. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన కార్మికుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story