విజయవాడలో విషాదం.. ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి
EV Battery Explosion in NTR District one dead.కాలుష్య రహితంగా ఉంటాయని ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలను
By తోట వంశీ కుమార్
కాలుష్య రహితంగా ఉంటాయని ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఇంధన ధరలు పెరుగుతుండడం కూడా ఇంకో కారణం. అయితే.. ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ఎలక్ట్రికల్ వాహనాలు అంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సూర్యారావుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో ముచ్చట పడి నిన్న ఎలక్ట్రికల్ బైక్‌ను కొనుగోలు చేశాడు. బ్యాటరీ చార్జింగ్ పెట్టగా.. ఈ ఉదయం పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక గులాబీపేటలో శివకుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఎంతో ముచ్చటపడి నిన్న(శుక్రవారం) ఎలక్ట్రికల్ బైక్‌ను కొనుగోలు చేశాడు. రాత్రి నిద్రించే ముందు బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టాడు. అయితే.. శనివారం తెల్లవారుజామున బ్యాటరీ పేలి పోయి.. ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్‌తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. మార్గమధ్యంలోనే శివకుమార్ మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎలక్ట్రికల్ బ్యాటరీలను చార్జింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గమనించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్దిష్ట సమయం సేపు మాత్రమే బ్యాటరీలను చార్జింగ్ పెట్టాలని, మంచి కంపెనీల బ్యాటరీలను మాత్రమే వినియోగించాలని వంటి కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తప్పించుకోవచ్చునని సూచిస్తున్నారు.