ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో బుధవారం తన గదిలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న జి. అరవింద్ (22) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన అరవింద్ ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. అతడు తన స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని నెలల నుంచి బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ అరవింద్.. తన స్నేహితుల దగ్గర బెట్టింగ్‌ల కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడని సమాచారం.
ఆర్థిక భారాన్ని భరించలేక అతను తన గదిలోనే జీవితాన్ని ముగించాడు. తోటి విద్యార్థులు అతడి గదికి వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వారు కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 194 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) D. చంద్రశేఖర్ తెలిపారు. (ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులు సహాయం కోసం '100' కు డయల్ చేయవచ్చు) .