వృద్ధురాలి హత్య.. డ్రమ్ములో ఛిద్రమైన శరీర భాగాలు
బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలో డ్రమ్ములో పడేసిన 65 ఏళ్ల మహిళ మృతదేహం శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.
By అంజి Published on 26 Feb 2024 8:04 AM ISTవృద్ధురాలి హత్య.. డ్రమ్ములో ఛిద్రమైన శరీర భాగాలు
ఆదివారం సాయంత్రం బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలో డ్రమ్ములో పడేసిన 65 ఏళ్ల మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడుబడిన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శరీర భాగాలు కనిపించాయి. బాధితురాలు కేఆర్ పురం సమీపంలోని ఓ ఫ్లాట్‌లో తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. నిందితుడు.. బాధితురాలి చేతులు, కాళ్ళను నరికి, మిగిలిన శరీర భాగాలను డ్రమ్‌లో పడవేసే ముందు వాటిని వేరే చోట పారవేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ నుంచి దుర్వాసన వస్తోందని గుర్తించిన స్థానికులు వెంటనే బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
"ఈ సంఘటన మొన్న జరిగి ఉండవచ్చు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు సీనియర్ అధికారులతో కలిసి నేను ఇక్కడకు వచ్చాను. సుమారు 65 ఏళ్ల మహిళ హత్యకు గురైంది, ఆమె మృతదేహాన్ని పాడుబడిన ప్రదేశంలో పడేశారు" అని బెంగళూరు పోలీస్ అదనపు కమిషనర్ రామన్ గుప్తా తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.
"మేము దర్యాప్తును చురుకుగా కొనసాగిస్తున్నాము. వీలైనంత త్వరగా నేరస్థులను పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని గుప్తా చెప్పారు. బాధితురాలు తన కుమార్తెతో పాటు మరికొందరు బంధువులతో కలిసి ఉంటోంది. కుటుంబానికి చెందిన ఇతర బంధువులు కూడా సమీపంలో నివసిస్తున్నారు.