ఇటీవల కాలంలో మనుషుల్లో ఓపిక నశిస్తోంది. కొంత సేపు కూడా ఓపిక పట్టడం లేదు. తాము అనుకున్న పని వెంటనే పూర్తి కావాలి లేదంటే ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. ఆ కోపంలో తమని తామో లేదా ఎదుటివారిని గాయపరచడం వంటివి చేస్తున్నారు. సమయానికి టిఫిన్, కాఫీ అందించలేదని కోడలి పై మామ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో కోడలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానే నగరంలో 76 ఏళ్ల కాశీనాథ్ పాండురంగ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం ఉదయం 11.30 గంటలకు అతడు 42 ఏళ్ల తన కోడలిపై కాల్పులు జరిపాడు. కడుపులో బుల్లెట్ గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కోడలు సమయానికి టీ, టిఫిన్ పెట్టనందుకే కాల్పులకు పాల్పడ్డాడని మరో కోడలు చెప్పింది. దీనిపై 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమయానికి టీ, టిఫిన్ పెట్టనందుకు కోపంతోనే కాల్పులు జరిపాడా..? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.