అక్క దీప్తి అనుమానాస్పద మృతి.. చెల్లి చందన అదృశ్యం.. సీసీ ఫుటేజ్‌లో..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

By అంజి  Published on  30 Aug 2023 7:00 AM IST
suspicious death.. Sister disappearance, Korutla town, Crime news

అక్క దీప్తి అనుమానాస్పద మృతి.. చెల్లి చందన అదృశ్యం.. సీసీ ఫుటేజ్‌లో..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక అదే సమయంలో యువతి చెల్లెలు కనిపించకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు దీప్తి(24), చందన, కుమారుడు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా, ఇంటి నుంచే పని చేస్తోంది. బీటెక్‌ పూర్తి చేసి చందన ఇంటి వద్దే ఉంటోంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.

బంధువుల ఇంట శుభకార్యం ఉండటంతో ఆదివారం నాడు శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కూతుళ్లతో ఫోన్‌లో మాట్లాడారు. తిరుగి మరునాడు మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోగా.. చందన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. మరోవైపు చందన కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story