ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నోకు వెళ్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీ కొనడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు ధరుహేరా నుంచి లక్నో వెళ్తుండగా ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని లక్నోకు రిఫర్ చేసినట్లు లఖింపూర్ ఖేరీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు .
సమాచారం అందుకున్న ఏడీఎం, సర్కిల్ అధికారి(సీఓ) జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘోర ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ''లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి సీఎం యోగి సంతాపం తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీనియర్ అధికారులను సీఎం ఆదేశించారు.'' అని సీఎంఓ ట్వీట్ చేసింది.