కూలీలతో వెలుతున్న ఆటో పై హైటెన్షన్ వైర్ తెగి పడింది. దీంతో ఆటో మంటల్లో కాలి బూడిద కాగా.. ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పెద్దకోట్ల పంచాయతీ గుడ్డంపల్లి గ్రామానికి చెందిన పది మంది కూలీలు పనుల నిమిత్తం గ్రామానికి చెందిన తలారి పోతులయ్య ఆటోలో చిల్లకొండయ్యపల్లికి వెలుతున్నారు. అయితే.. మార్గమధ్యంలో విద్యుత్ హెటెన్షన్ తీగ తెగి ఆటోపై పడింది. విద్యుత్ తీగ పడడంతో క్షణాల్లో వ్యవధిలో ఆటోకు మంటలు వ్యాపించాయి. కూలీలు బయటకు వచ్చేలోపు ఆటో మొత్తం తగలబడిపోయింది.
ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.