రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.

By Knakam Karthik
Published on : 10 July 2025 7:58 AM IST

Betting Apps Case, Tollywood Celebreties, Enforcement Directorate, TG Police

రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది. 29 మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్‌, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్‌ పోలీసుల ఎఫ్ఐఆర్‌ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై పెద్ద ఎత్తున దాడులకు దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లపై ECIR (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసింది. వీరంతా అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీసు స్టేషన్లలో నమోదైన ఐదు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద విచారణ ప్రారంభించింది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద విచారణ చేపట్టనుంది.

ఈసీఐఆర్‌లో పేర్కొన్న ప్రముఖ నటుల్లో

విజయ్ దేవరకొండ

రానా దగ్గుబాటి

ప్రకాశ్ రాజ్

నిధి అగర్వాల్

ప్రణిత సుభాష్

మంచు లక్ష్మి

టీవీ యాంకర్లు శ్రీముఖి, శ్యామల లాంటి వారు కూడా ఉన్నారు.

యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్‌లపై నిఘా

హర్ష సాయి

బయ్య సన్నీ యాదవ్

'లోకల్ బోయ్ నాని' ఛానెల్ టీం

వీరందరూ బెట్టింగ్ సంస్థలకు ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జంగ్లీ రమ్మీ, ఏ23, జీట్‌విన్, పారిమాచ్, లోటస్365 వంటి ప్లాట్‌ఫామ్స్‌కు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారాల ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడికెళ్లాయి? ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? ఎవరు స్పాన్సర్ చేసారు? డిజిటల్ యాడ్ రెవెన్యూ ఎంత? అన్నదానిపై ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేస్తున్నారు. త్వరలో సమన్లు జారీ చేసి ఈడీ జాబితాలో ఉన్న 29 మందిని విచారణకు పిలవనుంది. స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి తదుపరి చర్యలకు అడుగులు వేయనుంది.

Next Story