సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని గౌరారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు, సింగాయిపల్లికి చెందిన కొప్పోజు వెంకటస్వామి చారి (30) మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దేవతలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటన మంగళవారం నాడు రాత్రి సమయంలో జరిగింది. బుధవారం నాడు ఉదయం విగ్రహాలు ధ్వంసమైనట్టు గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సమగ్ర విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని కొంత మంది దుండగులు అక్రమంగా ప్రవేశించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాడిని గమనించిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులను గమనించిన దుండగులు పారిపోగా.. ఒకరు మాత్రం వారికి చేతికి చిక్కాడు.