కొడుకు పెళ్లి కారణంగా అప్పులపాలైయ్యాడు ఓ వ్యక్తి. అప్పు తీర్చేందుకు అతడు తీసుకున్న నిర్ణయం కారణంగా అతడు జైలు పాలు అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.
ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో రాజేంద్ర పండిట్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు ఓ వ్యక్తి దగ్గర కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో రాజేంద్ర పండిట్ తన కుమారుడి వివాహాన్ని చేశాడు. దీని వల్ల అతడికి రూ.4 నుంచి రూ.5లక్షల అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేక దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
తాను పని చేస్తున్న యజమాని ఓ పని నిమిత్తం బ్యాంకు నుంచి రూ.4లక్షలు డ్రా చేసి కారులో ఉంచడాన్ని గమనించాడు. అదును చూసి వాటిని రాజేంద్ర కాజేశాడు. డబ్బు గురించి అడుగగా తనకు ఏమీ తెలియదని చెప్పాడు. దీంతో సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు పరిశీలించగా ఈ చోరికి పాల్పడింది రాజేంద్రగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.