దారుణం.. నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల్ని కాల్చి చంపేశారు
Doctor couple shot dead in Rajasthan.రాజస్థాన్లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే
By తోట వంశీ కుమార్ Published on 29 May 2021 12:27 PM ISTరాజస్థాన్లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ డాక్టర్ దంపతులపై ఇద్దరు దుండగులు అతి దారుణంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ సందీప్ గుప్తా, ఆయన భార్య డాక్టర్ సీమా గుప్తా రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ ప్రాంతంలో నివసిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం ఏదో పని మీద వారిద్దరూ కారులో వెలుతుండగా.. బిజీ క్రాసింగ్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు.
బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి.. కారు దగ్గరికి వెళ్లాడు. డాక్టర్ సందీప్ గుప్తా కారు విండో గ్లాస్‌ను కిందకు దించగానే.. తుపాకీతో పలు మార్లు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడడంతో ఆ డాక్టర్ దంపతులిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనతో అక్కడ ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రతీకారంతోనే ఆ డాక్టర్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా.. డాక్టర్ సందీప్ కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఆ తరువాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారి ఇంటికి నిప్పంటుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2019లో సందీప్, అతడి భార్య సీమా, తల్లిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యాయి. కాగా.. ఆ మహిళ సోదరుడే ఇప్పుడు సందీప్ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చేపట్టారు.