గణేష్ నిమజ్జనంలో అపశృతి, వేర్వేరు చోట్ల ముగ్గురు చిన్నారుల మృతి

వేర్వేరు ప్రాంతాల్లో గణపతుల నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో ముగ్గురు బాలురు మృతి చెందారు.

By Srikanth Gundamalla  Published on  29 Sep 2023 4:13 AM GMT
Ganesh immersion, three deaths, Hyderabad, telangana,

 గణేష్ నిమజ్జనంలో అపశృతి, వేర్వేరు చోట్ల ముగ్గురు చిన్నారుల మృతి

గణేష్‌ నిమజ్జనాల్లో అపశృతి చోటుచేసకుంది. హైదరాబాద్‌ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో గణపతుల నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో ముగ్గురు బాలురు మృతి చెందారు. ఈ సంఘటనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

సంజీవయ్య పార్క్ వద్ద ఒక మైనర్ బాలుడు ప్రమాదవశాత్తు గణనాథుని తీసుకొని వస్తున్న లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన మైనర్ బాలుడు కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ కుమార్ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వెంట గణేషుడి నిమజ్జనం చేయడానికి బయలుదేరాడు. అయితే ప్రమాదవశాత్తు కాలుజారి లారీ కిందపడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

ఇదిలా ఉండగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో లారీటైర్ కింద పడి ఓ చిన్నారి బాలుడు మృతి చెందాడు. బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను తన భార్య, నాలుగేళ్ల కొడుకు ఆయుష్‌తో కలిసి గణేష్ నిమజ్జనం చేయడానికి బైక్‌పై వస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ కావడంతో కుటుంబ సభ్యులు బైక్ పై నుండి కింద పడిపోయారు. అదే సమయంలో బైక్ వెనుక నుండి వస్తున్న వాహనం నాలుగేళ్ల బాలుడు ఆయుష్ పై నుండి వెళ్ళింది. దీంతో ఆయుష్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడు ఆయుష్ మరణించాడు.

ఇబ్రహీంపట్నంలో మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న మైనర్ బాలుడు ప్రమాదవశాత్తు కాలు జాలి డాక్టర్ ట్రాలీ కింద పడి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చర్ల పటేల్ గూడకు చెందిన సేహనాథ్ (14)గా గుర్తించారు. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో బాలుర్లు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

Next Story