కరీంనగర్: హుజూరాబాద్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో రోడ్డు ఊడుస్తుండగా పారిశుధ్య కార్మికులు నల్గొండ సమ్మక్క, రాచపల్లి రాజేశ్వరిలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది . కారు హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.
హుజూరాబాద్ పట్టణం మామిండ్లవాడకు చెందిన సమ్మక్క(55) కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రాజేశ్వరిని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మరో ఘటనలో హుజూరాబాద్- కరీంనగర్ రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను పోలీసులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది.