చెట్టును ఢీ కొట్టిన బొలెరో.. ఆరుగురు మృతి.. దైవ ద‌ర్శ‌నానికి వెలుతుండ‌గా

Devotees going to savadatti temple met with accident in ramadurga.బెల‌గావి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 4:41 AM GMT
చెట్టును ఢీ కొట్టిన బొలెరో.. ఆరుగురు మృతి.. దైవ ద‌ర్శ‌నానికి వెలుతుండ‌గా

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెల‌గావి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. సవదత్తి యల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా బొలెరో వాహ‌నం అదుపు త‌ప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా మ‌రో 16 మందికి గాయాలు అయ్యాయి.

రామదుర్గ తాలూకాలోని హులకుంద, కున్నల గ్రామాలకు చెందిన కొంద‌రు హులకుంట గ్రామం సవదత్తి యల్లమ్మ ఆలయానికి పాద‌యాత్ర‌గా వెలుతున్నారు.ఓ బొలెరో వాహ‌నం వారి వ‌ద్ద‌కు వ‌చ్చి ఆగింది. డ్రైవ‌ర్ వారితో మాట్లాడి తాను అక్క‌డ దించుతాన‌ని వారిని ఒప్పించి కొంత న‌గ‌దు తీసుకున్నాడు. మ‌రికాసేప‌ట్లో గుడికి చేరుతామ‌న‌గా చుంచనూర్ గ్రామ సమీపంలో మలుపు వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రొక‌రు మ‌ర‌ణించారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. మృతులను హనుమవ్వ (25), దీప (31), సవిత (17), సుప్రీత (11), మారుతి (42), ఇందిరవ్వ (24)లుగా గుర్తించారు. వీరు వాహ‌నం ఎక్కిన 10 నిమిషాల్లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ ఘట‌న‌పై మంత్రి గోవింద కారజోల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 16 మందికి పైగా గాయపడ్డారని, వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.

Next Story