అమానవీయం.. బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వాహనం.. క్షతగాత్రుడిని డిక్కీలో తరలించారు..!
Devarakonda DSP Vehicle hits bike.నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ పోలీస్ అధికారి వాహనం
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2022 1:06 PM ISTనల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ పోలీస్ అధికారి వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణీస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. లేవలేని స్థితిలో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. అతడిని కారు డిక్కీలో వేసి ఆస్పత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు మునుగోడుకు వెలుతుండగా.. అదే దారిలో బైక్‌పై రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ చండూరుకి వెలుతున్నాడు. బోడంగిపల్లి శివారులోని ఓ మూలమలుపు వద్ద డీఎస్పీ వాహనం ధనుంజయ బైక్‌ను ఢీ కొట్టింది. పోలీస్ వాహనం వేగంగా ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి ధనుంజయ ఎగిరి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ధనుంజయకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే డీఎస్పీ సహ వాహనంలోని పోలీసులు కిందకు దిగారు. తీవ్రంగా గాయపడిన ధనుంజయను ఆస్పత్రికి తరలించాలని బావించారు. అంబులెన్స్ రావడానికి టైమ్ పడుతుందని బావించారో మరేమో తెలీదు కానీ.. తమ వాహనంలోనే 25 కి.మీదూరంలోని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. వాహనంలోనే అతడిని కూర్చోబెట్టడమో, పడుకోబెట్టడమో చేయకుండా డిక్కీలో అంతదూరం తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గాయపడిన ధనుంజయ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డీఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
— NewsMeter (@NewsMeter_In) August 19, 2022
కాగా..ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రమాదంపై నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని న్యూస్ మీటర్ సంప్రదించగా.. ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.