గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. గట్టిగా కేకలు వేయడంతో..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 11 Sept 2024 10:45 AM ISTగృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. గట్టిగా కేకలు వేయడంతో..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. బలత్కార సమయంలో బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం నాడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మంజులాపూర్ కాలనీకి చెందిన ఓ గృహిణి 3 రోజుల కిందట ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్లిఫ్‌కార్డులో ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ పెట్టింది. ఈ క్రమంలోనే డెలివరీ బాయ్ విఘ్నేశ్ ఇయర్‌ఫోన్స్ తీసుకొని మంగళవారం 11 గంటల సమయంలో డెలివరీ చేసేందుకు మహిళ ఇంటికి వెళ్లాడు.
భర్త ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లడంతో సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుతో ఆ డెలివరీ బాయ్.. మహిళపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. మహిళ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించారు. యువకుడు బైక్‌పై పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి ఇంటికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డెలివరీ బాయ్ విఘ్నేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.