ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట కామాంధులు మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. స్పాలో పని చేస్తున్న మహిళకు మత్తు మందు ఇచ్చి మేనేజర్‌తో పాటు కస్టమర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పితాంపుర ప్రాంతంలో ఉన్న ఓ స్పాలో భాదిత మహిళ (22) పని చేస్తుండేది. ఓ కస్టమర్‌ను మేనేజర్ తనకు పరిచయం చేశాడని, వారిద్దరు శీతలపానియంలో మత్తు మందు కలిపి తనకు ఇచ్చారని బాధిత మహిళ తెలిపింది. అనంతరం ఇద్దరూ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. దీని గురించి ఎక్కడైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. డబ్బులు ఇచ్చి విషయం సద్దుమణిగేందుకు ప్రయత్నించారు.
బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే శనివారం ఢిల్లీలోని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీతోపాటు, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే స్పాకు లైసెన్స్ ఉందా.. లేదా కూడా పరిశీలించాలన్నారు.