ఢిల్లీలో దారి దోపిడీ.. కేంద్రంపై సీఎం కేజ్రీవాల్ విమర్శలు

నలుగురు దుండగులు కారుని అడ్డుకుని.. తుపాకీతో కారులో ఉన్నవారిని బెదిరించారు.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2023 5:13 PM IST
Delhi, Theft On Road, Viral Video, Kejrwal

ఢిల్లీలో దారి దోపిడీ.. కేంద్రంపై సీఎం కేజ్రీవాల్ విమర్శలు

దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పిక్ పాకెటర్‌ నుంచి దారి దోపిడీ వరకు దొంగతనాలకు పాల్పడుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని రోడ్‌ టన్నెల్‌లో దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చి కారుని అడ్డుకుని డబ్బుని ఎత్తుకెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. దారి దోపిడీ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా స్పందించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వైఫల్యమంటూ విమర్శలు చేశారు.

గురుగ్రామ్‌లో ఒకరికి డబ్బు అప్పజెప్పేందుకు ఓ వ్యక్తి కారులో ఢిల్లీ నుంచి బయల్దేరాడు. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో ఏమో కానీ.. ప్రగతి మైదాన్‌ టన్నెల్‌లోకి కారు ప్రవేశించగానే రెండు బైకులు కారుని అడ్డగించాయి. నలుగురు దుండగులు కారుని అడ్డుకుని.. తుపాకీతో కారులో ఉన్నవారిని బెదిరించారు. ఆ తర్వాత వెనుక సీటులో డబ్బు పట్టుకుని కూర్చొన్న వ్యక్తిని బెదించారు. అతని దగ్గర నుంచి రూ.2లక్షల డబ్బుని లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా కొద్ది క్షణాల్లోనే జరిగిపోయింది. కొన్ని వాహనాలు ఆగినా వారూ అడ్డునే ధైర్యం చేయలేకపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా..ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ స్పందించారు. శాంతిభద్రత నిర్వహణ వైఫల్యమని పేర్కొన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సురక్షితంగా ఉంచలేకపోతే.. ఆ బాధ్యతలను ఆప్‌ ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. దారి దోపిడీపై పోలీసులు స్పందిస్తూ.. 1.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో దాదాపు 16 మంది భద్రత ఆసిబ్బంది కాపలాగా ఉన్నారని చెప్పారు. దోపిడీపై విచారణ జరుపుతున్నామని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు ఢిల్లీ పోలీసులు.

Next Story