24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌ అరెస్ట్‌

సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి
Published on : 25 April 2025 1:20 PM IST

Delhi Police, arrest, activist Medha Patkar, defamation case

24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌ అరెస్ట్‌

సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాకేత్ కోర్టు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయడంతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను అరెస్టు చేశారు. 2000లో 'నర్మదా బచావో' ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత ఎల్‌జీ వీకే సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై మేధా పాట్కర్‌ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు.

సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఏప్రిల్ 23 గడువు నాటికి ప్రొబేషన్ బాండ్లు, రూ. లక్ష జరిమానా చెల్లించడంలో ఆమె విఫలమైన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్‌ ప్రకారం.. ఒక పోలీసు బృందం ఆమెను నిజాముద్దీన్‌లోని ఆమె నివాసం నుండి అదుపులోకి తీసుకుంది. ఆమెను సాకేత్ కోర్టులోని లింక్ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రిసైడింగ్ జడ్జి, అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు.

Next Story