ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని డ్రైన్‌లో మంగళవారం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఫోన్ కాల్ డేటా పరిశీలించిన పోలీసులు.. రెండు నంబర్లను ట్రేస్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యువకుడిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాధితుడికి కాల్స్ వచ్చిన రెండు నంబర్లను పోలీసులు ట్రేస్ చేసి, రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ట్రాక్ చేశారు.
మృతుడు కరోల్ బాగ్‌కు చెందిన విష్ణుగా గుర్తించగా, నిందితులు చురు జిల్లాకు చెందిన సంజయ్ బుచ్చా, సీతారాం సుతార్‌గా గుర్తించారు. రాజ్‌హస్త్‌లోని చురు జిల్లాకు చెందిన ఒక అమ్మాయితో విష్ణుకు సంబంధం ఉంది. ఆ అమ్మాయిని ఇష్టపడిన సంజయ్, అతని స్నేహితుడు సీతారాం విష్ణుతో కలిసి దీపావళి జరుపుకోవడానికి ఢిల్లీకి వచ్చారని ప్రధాన నిందితుడు సంజయ్ పోలీసులకు చెప్పాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌహాన్ తెలిపారు.
తన ఫోన్‌లో ఉన్న అమ్మాయి చిత్రాలను తొలగించేందుకు నిరాకరించడంతో సంజయ్ విష్ణును గొంతు కోసి హత్య చేశాడు. సంజయ్, సీతారాం కారులో దాదాపు రెండు గంటల పాటు విష్ణు మృతదేహాన్ని పెట్టుకుని తిప్పారు. పండుగ కారణంగా ఎవరికీ అనుమానం రాలేదు. తరువాత మృతదేహాన్ని కరోల్ బాగ్‌లోని కాలువలో పడేశారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న ఓ వెబ్ సిరీస్ నుండి నిందితులు హత్య పద్ధతిని చూసి అమలు చేశారని దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారి తెలిపారు.