దారుణం.. కొద్ది గంటల్లో పెళ్లి అనగా కొడుకుని చంపిన తండ్రి
ఓ తండ్రి కొడుకుని అతికిరాతకంగా పొడిచి చంపేశాడు. మరికొన్ని గంటల్లో కుమారుడి పెళ్లి ఉందనగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 8 March 2024 3:46 PM ISTదారుణం.. కొద్ది గంటల్లో పెళ్లి అనగా కొడుకుని చంపిన తండ్రి
చిన్న చిన్న వివాదాలకే గొడవలు పెట్టుకుంటున్నారు. రోజుకు రోజుకు మానవసంబంధాలు బలహీనపడిపోతున్నాయి. పంతాలకు పోయి.. ఘర్షణలు పడుతున్నారు. కొన్ని సంఘటనల్లో క్షణికావేశంలో ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ తండ్రి కొడుకుని అతికిరాతకంగా పొడిచి చంపేశాడు. మరికొన్ని గంటల్లో కుమారుడి పెళ్లి ఉందనగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీలో గౌరవ్ సంఘాల్ (29) అనే యువకుడు జిమ్‌ను నడుపుతున్నాడు. గురువారం అతనికి వివాహం నిశ్చయించారు. మరికొద్ది గంటల్లోనే గౌరవ్ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే తండ్రీ కొడుకుల మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తీవ్ర కోపోద్రిక్తుడైన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. రోజూ తనతో కొడుకు గొడవపడుతున్నాడంటూ కోపంతో కుమారుడిని 15 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఒకవైపు సంగీత వాయిద్యాల చప్పుళ్లు మోగుతున్నాయి. దాంతో.. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ.. ఆ తర్వాత కొడుకుని తండ్రి కత్తితో పొడవడం ఎవరూ గమనించలేదు. వివాహ ఊరేగింపు కోసమని బంధువులంతా వరుడి కోసం వెతక సాగారు. ఈక్రమంలోనే రక్తపు మడుగులో పడిఉన్న గౌరవ్ సంఘాల్‌ను చూశారు. దాంతో.. బంధువులంతా షాక్ తిన్నారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిచి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. గౌరవ్ సంఘాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పరారీలో ఉన్న గౌరవ్ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గాలింపు చేపట్టగా నిందితుడిని పట్టుకున్నారు. దర్యాప్తులో నిందితుడు తన కుమారుడిని హత్య చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు వెల్లడించారు.