డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన ఫోటో
Degree student suicide in Gadwal District.సమీప బంధువైన ఓ యువకుడితో దిగిన ఫోటో డిగ్రీ విద్యార్థిని మరణానికి
By తోట వంశీ కుమార్ Published on 16 Nov 2022 9:23 AM ISTసమీప బంధువైన ఓ యువకుడితో దిగిన ఫోటో డిగ్రీ విద్యార్థిని మరణానికి కారణమైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న, నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారైలు, ఓ కుమారుడు సంతానం. పెద్ద కూతురు మేఘలత(20) జిల్లా కేంద్రంలోని ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన శివకుమార్(24) ఆమెతో కలిసి 2019లో ఓ ఫోటో దిగాడు. అనంతరం మేఘలతను శివకుమార్ ప్రేమిస్తున్నానని చెప్పగా అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చారు.
ఈ నెల 6న శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. శివకుమార్ స్నేహితుడు ఆ ఫోటోను అమర ప్రేమికులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురైంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నాం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలంలో సూసైడ్ నోటు లభించింది. అందులో "అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నేను ఎవరినీ ప్రేమించలేదు. నేను మీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో నేను, శివకుమార్ ఓఫోటో దిగగా.. దాన్ని అడ్డం పెట్టుకుని నాలుగేళ్లుగా వేధించాడు. మీకు చెబితే లేనిపోని గొడవలు అవుతాయని సైలెంట్‌గా ఉన్నా. వాడు చనిపోయాక.. వాడి స్నేహితుడు నన్ను బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు మన పరువు తీశాడు. ఎవరికీ ముఖం చూయించుకోలేకపోతున్నా. వాడిని మాత్రం వదలకు నాన్నా. చెల్లిని, అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో "అని రాసిఉంది.
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.