వరంగల్ జిల్లాలో పరువు హత్య.. నిద్రిస్తున్న కుమార్తెను హతమార్చిన తల్లి
Defamation murder in Warangal district.ఇటీవల కాలంలో పరువు కోసం ఎంత దారుణానికైనా వెనుకాడడం లేదు. తమ
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 10:20 AM ISTఇటీవల కాలంలో పరువు కోసం ఎంత దారుణానికైనా వెనుకాడడం లేదు. తమ పరువు పోతుందనే కారణంతో సొంత వారిని హత మారుస్తున్నారు. కుమార్తె వేరే కులం వాడిని ప్రేమించిందని తెలిసి ఆ తల్లి ఆగ్రహాంతో ఊగిపోయింది. కుమార్తె అతడిని వివాహం చేసుకుంటే సమాజాంలో తమ పరువు పోతుందని బావించింది. తన తల్లితో కలిసి ఆ కూతురిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పర్వతగిరిలో ఉంటున్న ఉబ్బని సమ్మక్క భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారైలు. పెద్ద కుమారైకు వివాహాం కాగా.. చిన్న కుమారై అంజలి(17), తల్లి యాకమ్మతో కలిసి ఉంటోంది. కూరగాయలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. పదో తరగతి చదువుతున్న అంజలి అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం సమ్మక్కకు తెలియడంతో పలుమార్లు అంజలిని మందలించింది. అయినప్పటికీ కుమారైలో మార్పు రాలేదు. కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే ఊర్లో తమ పరువు పోతుందని సమ్మక్క బావించింది.
దీంతో తల్లి యాకమ్మతో కలిసి సమ్మక్క నవంబర్ 19న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అంజలి ముఖంపై దిండు ఉంచి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ప్రేమ వివాహానికి తాము అంగీకరించకపోవడంతోనే కుమార్తె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అందరినీ నమ్మించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. సమ్మక్క, యాకమ్మలను ప్రశ్నించగా.. కూతురు కులాంతర వివాహం చేసుకుంటే ఊర్లో తమ పరువు పోతుందనే ఉద్దేశ్యంతోనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.