సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 44కి చేరింది. పనేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్, ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వర్ మృతి చెందారు.
మరోవైపు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పాశమైలారం సిగాచీ పరిశ్రమను పరిశీలిచింది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్‌డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది. కాగా గత నెల 30వ తేదీన ఈ దుర్ఘటన జరిగింది. 9 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.