కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి.. ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లిన సీఎం మ‌మ‌త‌

Death toll in Kolkata railway building fire rises to 9.కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు రైల్వే ప్రధాన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 4:10 AM GMT
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి.. ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లిన సీఎం మ‌మ‌త‌

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ద‌గ్గ‌ర‌లోని ఓ అపార్ట్‌మెంట్ భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీసు ఏఎస్ఐ ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రి సుజీత్ బోస్ తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే.. న‌గ‌రంలోని స్ట్రాండ్ రోడ్‌లో ఉన్న న్యూ కోయిలా ఘాట్ బిల్డింగ్‌లోని 13వ అంత‌స్తులో సోమ‌వారం సాయంత్రం 6.30గంట‌ల స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగాయి. తూర్పు, ఆగ్నేయ రైల్వేల‌కు చెందిన కార్యాల‌యాలు ఈ భ‌వ‌నంలో ఉన్నాయి.

స‌మాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది 25 ఫైర్ ఇంజిన్‌ల‌తో వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఉప‌యోగించారు. మంట‌లు మరింత వ్యాప్తించ‌డంతో అపార్ట్‌మెంట్‌కు క‌రెంట్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. దాంతో లిఫ్ట్‌లోనే పొగ‌తో ఊపిరాడ‌క ఐదుగురు పైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్ర‌మాద స‌మ‌యంలో ఎలివేట‌ర్‌ను వినియోగించ‌డం వ‌ల్లే విషాదం చోటు చేసుకుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. అయితే.. అగ్ని ప్రమాదం సమయంలో లిఫ్టు ఉపయోగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగుగా.. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కోల్‌కతా కమిషనర్ సౌమెన్ మిత్రా, మంత్రి సుజీత్ బోస్, జాయింట్ సీపీ (క్రైమ్) మురళీధర్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. గత రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ పరిస్థితిని చూసి చలించిపోయారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అగ్ని ప్రమాదం కారణంగా.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడింది. దీంతో అక్కడి రైల్వే స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ టికెట్ బుకింగ్‌కి అంతరాయం కలిగింది. సర్వర్ రూమ్, ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ అన్నీ ఆ భవనంలోనే ఉన్నాయి.

ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు.





Next Story