దారుణం.. కుళ్లిన శవం నీళ్లు తాగిన గ్రామస్తులు
Dead Body Found In Water Tank.రాజకీయ నాయకుడి కుమారుడు ఆ ఊరి వాటర్ ట్యాంకులో శవమై
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2023 10:55 AM ISTకొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఆ ఊరి వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు. ఈ విషయం తెలియని ఆ గ్రామ ప్రజలు తొమ్మిది రోజుల పాటు ఆ నీటిని తాగారు. రోజు రోజుకు మంచి నీటి నుంచి దుర్వాసన అధికం అవుతుండడంతో సిబ్బందికి తెలుపగా.. వారు వాటర్ ట్యాంకు పరిశీలించగా మృతదేహాం బయటపడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో జరిగింది.
విరుధాచలం పరిధిలోని రాజేంద్ర పట్నం గ్రామంలో శివశంకర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతను ఓ రాజకీయ నాయకుడు. ఇతని కొడుకు శరవణ్ కుమార్ (34) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఖాళీగానే ఇంటి వద్ద ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడు కనిపించకుండా పోయాడు. శరవణ్ కుమార్ కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెతికారు. తెలిసిన వారిందరికి ఫోన్ చేశారు. అయినప్పటికీ అతడి ఆచూకిని కనుగొనలేకపోయారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. దాదాపు నాలుగైదు రోజుల నుంచి ఆ గ్రామంలోని వాటర్ ట్యాంక్ నీళ్లు దుర్వాసన వస్తున్నాయి. రోజు రోజుకి దుర్వాసన అధికం అవుతుండడంతో కొందరు గ్రామస్తులకు అనుమానం వచ్చింది. సిబ్బంది సాయంతో గ్రామ ఓవర్ హెడ్ ట్యాంకు తెరచి చూసి షాకైయ్యారు. 9 రోజులుగా కనిపించకుండా పోయిన శరవణ్‌కుమార్ శవమై నీటిలో కనిపించాడు. అతడి మృతదేహం కుళ్లి పోయిన స్థితిలో ఉంది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరవణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా చంపి అతడిని అందులో పడేశారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తొమ్మిది రోజుల పాటు మృతదేహాం నీటిలో ఉండగా.. ఆ నీటినే ఆ గ్రామ ప్రజలు తాగారు. దీంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఇన్‌ఫెక్షన్ భయంతో కొందరు ఆస్పత్రికి పరుగులు తీశారు. వైద్య బృందం కూడా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది.