Hyderabad: అక్రమంగా గ్లైకోరిల్ దగ్గు సిరప్‌ తయారీ.. ఆటకట్టించిన డీసీఏ

తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలో అక్రమంగా గ్లైకోరిల్‌ దగ్గు సిరప్‌ తయారు చేస్తున్న తయారీ యూనిట్‌పై దాడి చేసి రూ.65 వేల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

By అంజి  Published on  11 Sept 2024 6:42 AM IST
DCA, illegally manufacturing, glycolic cough syrup, Kukatpally, Hyderabad

Hyderabad: అక్రమంగా గ్లైకోరిల్ దగ్గు సిరప్‌ తయారీ.. ఆటకట్టించిన డీసీఏ

హైదరాబాద్‌: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలో అక్రమంగా గ్లైకోరిల్‌ దగ్గు సిరప్‌ తయారు చేస్తున్న తయారీ యూనిట్‌పై దాడి చేసి రూ.65 వేల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తికి అవసరమైన డ్రగ్ లైసెన్స్ లేకుండానే అఖిల్ లైఫ్ సైన్సెస్ దగ్గు సిరప్ (టెర్బుటాలిన్ సల్ఫేట్, ఆంబ్రోక్సోల్ హెచ్‌సిఎల్, గ్వైఫెనెసిన్, మెంథాల్ సిరప్)ను తయారు చేస్తున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు సోమవారం డ్రగ్స్‌ తయారీ యూనిట్‌పై దాడులు చేశారు. ఈ దాడిలో అనుమతి లేకుండా గ్లైకోరిల్ దగ్గు సిరప్‌ను తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్‌తో మాత్రమే గ్లైకోరిల్ దగ్గు సిరప్‌ను తయారు చేయవచ్చని అధికారులు తెలిపారు. తయారీ ప్రక్రియ డ్రగ్స్ నియమాల షెడ్యూల్ M క్రింద సూచించబడిన మంచి తయారీ విధానాలకు (GMP) కట్టుబడి ఉండాలి. ఇండియన్ ఫార్మకోపోయియా (IP) ద్వారా నిర్దేశించబడిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

ఈ దాడిలో డీసీఏ అధికారులు 100 ml 635 సీసాలు గ్లైకోరిల్ దగ్గు సిరప్‌తో పాటు ఉత్పత్తి యొక్క ప్రింటెడ్ లేబుల్‌లను స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ లైఫ్ సైన్సెస్ యజమాని భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. తదుపరి విచారణ నిర్వహించి సంబంధిత నేరస్తులందరిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీసీఏ తెలిపింది.

ప్రజా సలహా

డ్రగ్ లైసెన్స్ లేకుండా తయారు చేయబడిన డ్రగ్స్ ఇండియన్ ఫార్మకోపోయియా (IP), డ్రగ్స్ రూల్స్, 1945లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలం కావచ్చు. అటువంటి ఉత్పత్తులు రోగుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.

చెల్లుబాటు అయ్యే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ లేకుండా డ్రగ్స్ తయారు చేయడం, విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం శిక్షార్హమైనది, ఐదేళ్ల వరకు జైలు శిక్ష.

నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో సహా డ్రగ్స్‌కు సంబంధించిన ఏదైనా అనుమానిత తయారీ కార్యకలాపాలు, అలాగే ఔషధాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఏవైనా ఇతర ఫిర్యాదులను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజలు నివేదించవచ్చు. 1800-599-6969, అన్ని పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది.

Next Story