రాజస్థాన్ రాష్ట్రంలో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుండలో నీరు తాగాడని 9 ఏళ్ల దళిత బాలుడిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. జలోల్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చైల్ సింగ్(40) అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో 9 ఏళ్ల బాలుడు చదువుతున్నాడు. జూలై 20న కుండలోని నీటిని తాగాడని బాలుడిని చైల్ సింగ్ తీవ్రంగా కొట్టాడు. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చైల్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నియంత్రణ) చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
బాలుడి మృతిపై సీఎం అశోక్ గెహ్లట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలుడి మృతి బాధాకరమన్నారు. జలోల్ ఎస్పీ అగర్వాల్లా నేతృత్వంలో పోలీస్ విచారణ జరుగుతోందని, ఈ ఘటనపై రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా సోమవారం(ఆగస్టు 15న) సురానా గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.