పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు.. 4 వేలపైచిలుకు మొబైల్ ఫోన్లు స్వాధీనం

పాత మొబైల్ ఫోన్‌లను అమ్మేస్తున్నారా.. అయితే తస్మా జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు పాత మొబైల్ ఫోన్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు

By అంజి  Published on  22 Aug 2024 6:56 AM IST
Cyber ​​crimes, old mobile phones, Police seized more than 4 thousand old mobile phones, Telangana, Ramagundam

పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు.. 4 వేలపైచిలుకు మొబైల్ ఫోన్లు స్వాధీనం

పాత మొబైల్ ఫోన్‌లను అమ్మేస్తున్నారా.. అయితే తస్మా జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు పాత మొబైల్ ఫోన్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు... సైబర్ చీటర్స్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్త కొత్త సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు. పాత మొబైల్ ఫోన్లను తీసుకొని వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా ఆటకు పోలీసులు చెక్ పెట్టారు. నేరగాళ్లు పోలీసుల చేతికి చిక్కకుండా తెలివిగా మోసాలకు పాల్పడుతుంటే వారి ఎత్తులకు పైఎత్తులు వేసి పోలీసులు వారి ఆటను చిత్తు చేశారు.

తెలంగాణ జిల్లాలోని రామగుండం పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లుగా రామగుండం సిసిపిఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందికి విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను ప్రజల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వారికి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బులను ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

బీహార్ లోని హతియా దియారాకు చెందిన మహమ్మద్ షామి(30), అబ్దుల్ సలాం(28), మహమ్మద్ ఇఫ్తికార్(32) ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. అఖ్తర్ అలీ (37) అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ నలుగురు కలిసి సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. పథకంలో భాగంగానే పాత మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి సైబర్ నేరగాళ్లకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నలుగురు తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంతో పాటు మరికొన్ని జిల్లాలలో సంచరిస్తూ తక్కువ ధరకు ప్రజల నుండి మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటిని బీహార్ కు తరలిస్తున్నారు. అలా మొబైల్ ఫోన్లను తమ గ్రామంలో నివసిస్తున్న సహచరుడికి అప్పగిస్తున్నారని విచారణలో వెల్లడైంది.

తెలంగాణ రాష్ట్రంలోని పల్లి జిల్లాల్లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసుకుని బీహార్ మీదుగా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు సరఫరా అవుతున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు నిందితుడు అక్తర్ మొబైల్ ఫోన్ల యొక్క సాఫ్ట్వేర్ మదర్ బోర్డ్, ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు పంపుతున్నాడు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లకు పాత మొబైల్ ఫోన్ లను పంపించి ...పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ సైబర్ నెరగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడి మోసపూరితంగా డబ్బులను సంపాదిస్తున్నారు.

గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా.. పోలీసులు ఎంటరై ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 వేల మొబైల్ ఫోన్‌లో కలిగిన మూడు గోనెసంచులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మ వద్దని, ఇవ్వవద్దని సూచించారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వారు వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలు తమ పాత ఫోను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ సూచించారు.

Next Story