ఆవు శరీర భాగాలను ఆలయంలోకి విసిరారు.. నలుగురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని జాయోరా పట్టణంలోని ఆలయ ప్రాంగణంలో ఆవు తలను నరికివేసిన కేసులో నలుగురు వ్యక్తులపై ఎన్‌ఎస్‌ఎ ప్రయోగించబడిందని పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 16 Jun 2024 5:30 AM GMTఆవు శరీర భాగాలను ఆలయంలోకి విసిరారు.. నలుగురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని జాయోరా పట్టణంలోని ఆలయ ప్రాంగణంలో ఆవు తలను నరికివేసిన కేసులో నలుగురు వ్యక్తులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించబడిందని పోలీసు అధికారి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోవు శరీర భాగాలను ఆలయ ఆవరణలో విసిరినట్లు అధికారులు తెలిపారు. ఇది రత్లాం జిల్లాలోని పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, ఇతర నేరాలకు పాల్పడినందుకు నలుగురు వ్యక్తులను వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) మనోజ్ కుమార్ సింగ్ విలేకరులకు తెలిపారు.
సల్మాన్ మేవతి (24), షకీర్ ఖురేషి (19), నోషాద్ ఖురేషీ (40), షారుక్ సత్తార్ (25) అనే నలుగురు నిందితులపై ఎన్‌ఎస్‌ఏ నిబంధనలు ప్రయోగించామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ ఖాఖా శనివారం తెలిపారు. ''మేవతి, ఖురేషీలను శుక్రవారం అరెస్టు చేయగా, నోషాద్, సత్తార్‌లను గురువారం అరెస్టు చేశారు. నోషాద్‌పై 20 కేసులున్నాయి'' అని చెప్పారు.
''ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరిగింది. అయితే, సకాలంలో చర్యల వల్ల పరిస్థితులు అదుపులో ఉన్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పోలీసులు, పరిపాలన అధికారులను కోరారు'' అని మనోజ్ కుమార్ సింగ్ అన్నారు. నిందితుల ఇళ్లలోని అక్రమ భాగాలను స్థానిక యంత్రాంగం కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం జరిగిన ఈ ఘటన తర్వాత కొన్ని హిందూ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించి జౌరా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి గౌరవ్ పూరి గోస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పట్టణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పట్టణంలో శాంతి సామరస్యాలను కాపాడాలని జావోరాకు చెందిన షహర్ ఖాజీ హఫీజ్ భురు లేఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.