న‌దిలో దూకిన మ‌హిళా వ‌లంటీర్‌.. కాపాడ‌బోయి కౌన్సిల‌ర్ మృతి

Councillor dies while saving a women volunteer in Mummidivaram.ఓ మ‌హిళా గోదావ‌రిలోకి దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించ‌గా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jan 2022 4:39 AM GMT
న‌దిలో దూకిన మ‌హిళా వ‌లంటీర్‌.. కాపాడ‌బోయి కౌన్సిల‌ర్ మృతి

ఓ మ‌హిళా గోదావ‌రిలోకి దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించ‌గా.. ఆమెను కాపాడే క్ర‌మంలో కౌన్సిల‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. కొత్త‌సంవ‌త్స‌రం తొలి రోజున ఈ విషాద ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే పెద‌మూడీ ల‌క్ష్మీకుమారి.. ముమ్మిడివరం నగర పంచాయతీ బొండాయికోడు సచివాలయంలో 13వ వార్డు వలంటీర్‌గా ప‌నిచేస్తోంది. ఆమెకు వివాహాం కాగా.. భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఇటీవ‌లే విడాకులు తీసుకుంది. ప్ర‌స్తుతం పుట్టింటిలోనే ఉంటోంది.

శుక్ర‌వారం రోజున కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ జ‌రిగింది. దీంతో మ‌న‌స్థాపం చెందిన ల‌క్ష్మీ శ‌నివారం మ‌ధ్యాహ్నాం అన్నంప‌ల్లి అక్విడెక్టు వ‌ద్ద‌కు వ‌చ్చింది. గోదావ‌రి న‌ది పాయ‌లో దూకేందుకు అక్క‌డ త‌చ్చాడుతోంది. అదే స‌మ‌యంలో అటుగా వెలుతున్న లంకాఫ్ ఠాణేలంకలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రెడ్డి రమణ ఆమెను చూసి.. అనుమానించి 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయదుర్గారావు (35)కు సమాచారం అందించారు. వెంటనే విజ‌య‌దుర్గారావు అక్క‌డ‌కు చేరుకున్నారు.

అయితే.. అప్ప‌టికే ల‌క్ష్మీ కుమారి న‌దిలోకి దూకేసింది. దీంతో ఆమెను ర‌క్షించేందుకు దుర్గారావు సైతం న‌దిలోకి దూకాడు. న‌దీ ప్ర‌వాహాం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇద్ద‌రూ మునిగిపోయారు. వారిద్ద‌రిని గుర్తించిన మ‌త్య్స‌కారులు ర‌క్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే.. అప్ప‌టికే దుర్గారావు మృతి చెందాడు. స్థానికులు ల‌క్ష్మీకుమారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుర్గారావు రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేశార‌ని.. ఆయ‌న‌కు వివాహం కాలేద‌ని స్థానికులు తెలిపారు. కౌన్సిల‌ర్ మృతితో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Next Story
Share it