మటన్ కూర కోసం భార్యతో గొడవ.. కోపంతో పక్కింటి వ్యక్తిని కొట్టి చంపిన భర్త
Controversy in the couple over the matter of making mutton, neighbor killed in the middle. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖిరియా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది.
By అంజి Published on 20 Oct 2022 2:15 PM IST
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖిరియా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 45 ఏళ్ల పొరుగు వ్యక్తిని కొట్టి చంపాడు. నిందితుడు పప్పు అహిర్వార్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. మటన్ కూర వండడంపై నిందితుడికి, అతని భార్యకు మధ్య జరిగిన గొడవలో పొరుగింటి వ్యక్తి బల్లునాథ్ (45) జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పప్పు బరువైన కర్రతో బల్లునాథ్ తల వెనుక భాగంలో కొట్టాడు. అతడు నేలపై పడగానే మరో దెబ్బ కొట్టాడు. రెండో దెబ్బకు బాధితుడి తలకు బలమైన గాయం కాగా దంతాలు విరిగిపోయాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న బిల్ఖిరియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. బిల్ఖిరియా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ చతుర్వేది మాట్లాడుతూ.. మృతుడు తన కుమారుడు సచిన్ (19)తో కలిసి బిల్ఖిరియాలోని ఛవ్ని పత్తర్ గ్రామంలోని సాగర్ మొహల్లాలో నివాసముంటున్నాడు. అతని భార్య చనిపోయింది. అతను వ్యవసాయ కూలీగా పనిచేశాడు. నిందితుడు తన భార్య కుంతీ బాయితో కలిసి అతని పొరుగున నివసిస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి 11 గంటల సమయంలో పప్పు మటన్ తీసుకొచ్చి వండేందుకు సిద్ధమవుతున్నాడని చతుర్వేది తెలిపారు.
మంగళవారం కావడంతో నాన్ వెజ్ తినవద్దని భార్య కుంతి అభ్యంతరం వ్యక్తం చేసింది. మటన్ వండాలని పట్టుబట్టడంతో పప్పు, కుంతి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అతను కుంతిని కొట్టడం ప్రారంభించాడు. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె అరుపులు విన్న బల్లు, ఇతర ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పప్పు నుంచి కుంతిని కాపాడేందుకు బల్లు జోక్యం చేసుకుని అతనితో గొడవ పడ్డాడు. పప్పు బల్లును ముగ్గురు-నలుగురు పొరుగువారితో చూసి కుంతిని కొట్టడం మానేశాడు.
అతడిపై కోపంతో అదే గ్రామంలోని తన మరో ఇంటికి కుంతీ రాత్రి నిద్రించేందుకు వెళ్లింది. పప్పు తనపై దూషించినందుకు బల్లుపై కోపంతో రగిలిపోయాడు. ఘటన తర్వాత ఇరుగుపొరుగు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక గంట తర్వాత అర్ధరాత్రి బల్లు తన ఇంటి వెలుపల వరండాలో ఒంటరిగా కూర్చున్నప్పుడు, పప్పు తన చేతిలో బరువైన రాజస్థానీ కర్రతో సంఘటనా స్థలానికి చేరుకుని అతని తల వెనుక కొట్టాడని ఎస్‌హెచ్‌వో చెప్పారు. దీంతో బల్లుకు తీవ్ర గాయాలు తగిలి నేలపై పడిపోయాడు. శబ్దం విని ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి పప్పు రక్తపు మడుగులో పడిపోయాడు. నిందితుడు అప్పటికే అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.