ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కారుపై ప‌డ్డ కంటైన‌ర్‌.. న‌లుగురి మృతి

Container collapsed on moving car.రాజ‌స్థాన్ రాష్ట్రంలో కంటైన‌ర్ కారుపై ప‌డింది. ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 1:26 PM IST
container collapse

రాజ‌స్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. పాల‌రాతి లోడ్‌తో వెలుతున్న కంటైన‌ర్ కారుపై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న పాలి జిల్లాలో జ‌రిగింది. గుడా ఆండ్లా పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు..పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ పడింది. కంటైన‌ర్ లోడ్‌ కార్‌పై పడడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.

కారులో ఉన్న‌ దంప‌తుల‌తో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదం పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. చాలా శ్ర‌మించి మృత‌దేహాల‌ను వెలికితీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం గుండోజ్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్‌, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story