కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిక్కనూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించాయి. దీంతో చెరువులో గాలించగా శ్రుతి, నిఖిల్ మృతదేహలు లభ్యమయ్యాయి. సాయి కుమార్ డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సై సాయికుమార్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన ఆరా తీశారు. అటు కానిస్టేబుల్ శ్రుతి నిన్న ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్‌లో చెప్పి బయటకు వెళ్లింది. కూతురు మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చివరకు ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడి చేరుకుని చూడగా శ్రుతి సెల్‌ఫోన్‌తో పాటు నిఖిల్ ఫోన్ కూడా దొరికింది. ఎస్సై సాయికుమార్ కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించగా శ్రుతి, నిఖిల్ డెడ్‌బాడీలు కనిపించాయి. ఎస్సై ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుండటంతో ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదు.