Telangana: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 21 Jun 2024 6:15 AM ISTTelangana: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గురువారం నాడు సాయంత్రం ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి.. హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. అయితే రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.
ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత రెండ్రోజుల నుంచి పాఠశాలకు వెళ్లలేదు. ఎమ్మెల్యే ఉదయమే పలు కార్యక్రమాల దృష్ట్యా చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.