తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అజిత్ కుమార్ భారీ అంతర్గత రక్తస్రావం మరియు గాయంతో బాధపడ్డాడని, తీవ్రమైన మరియు విస్తృతమైన శారీరక దాడికి గురయ్యాడని వెల్లడైంది. మృతుడి ఒంటిపై 44 గాయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
దీంతో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు తెలుస్తోంది. గుండె, కాలేయం వంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అతడిపై కొన్ని రోజుల పాటు ఈ దాడి జరిగినట్లు వెల్లడైంది. కర్రలు, లాఠీలు లేదా రాడ్‌లు వంటి వాటిని ఉపయోగించడంతో ఈ గాయాలైనట్లు నివేదికలో స్పష్టమైంది. ఇవి సాధారణంగా ప్రమాదవశాత్తు గాయాలు లేదా ఒంటరిగా దాడిలో కనిపించవు, కానీ దీర్ఘకాలిక, ఉద్దేశపూర్వక శారీరక వేధింపులలో కనిపిస్తాయి..అని డాక్టర్లు పేర్కొన్నారు.
శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని మడపురంలో ప్రసిద్ధి భద్రకాళియమ్మన్ ఆలయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో ఆ ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్‌కుమార్‌తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అజిత్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.