జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో చిన్నారులు సహా కనీసం 14 మంది గాయపడ్డారు. అనంతనాగ్‌లోని షైర్‌బాగ్‌లోని మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు.
ఆస్పత్రిలోని టికెట్ సెక్షన్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు. హీటింగ్ గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశానికి పలువురు చేరుకుని ఆస్పత్రిలో చేరిన రోగులను రక్షించేందుకు ప్రయత్నించడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఈ ఘటన తర్వాత స్థానికులు ఈ ప్రసూతి ఆసుపత్రిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆసుపత్రి భవనం సురక్షితంగా లేదని, రద్దీగా ఉందన్నారు.