ప్రియురాలికి చేసిన ఖర్చును రాసి.. ప్రేమికుడి ఆత్మహత్య
Chikkamagaluru Man commit suicide over lover cheating.కొందరు ప్రేమ పేరుతో వారి అవసరాలను తీర్చుకుంటున్నారు.
By తోట వంశీ కుమార్
కొందరు ప్రేమ పేరుతో వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. పెళ్లి పేరు ఎత్తగానే ముఖం చాటేస్తున్నారు. దీంతో అవతలి వారు తాము మోసపోయామని ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుంటాం. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగళూరు జిల్లాలో ఇలాంటి ఘటన నే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శంకరపూర్ లో చేతన్(31) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ట్రాన్స్ పోర్టు వాహనాన్ని నడిపే అతను తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రియురాలి సరదాలు, షాపింగ్‌కోసం తన సంపాదనలో ఎక్కువ మొత్తం ఖర్చుచేసేవాడు. ఈ క్రమంలో ఎన్నాళ్లుగా ఇలా ప్రేమికులుగా ఉంటామని, పెళ్లి చేసుకుందామని తన ప్రియురాలిని అడిగాడు. అయితే.. పెళ్లికి ఆ యువతి నిరాకరించింది.
ఎన్ని సార్లు అడిగిన ఆమె ఒప్పుకోలేదు. తన స్నేహితుల దగ్గర చేతన్.. తన బాధను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలి ప్రవర్తనతో విసిగిపోయిన అతడు దారుణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చేతన్ తన బాధను తెలియజేశాడు. తన ప్రియురాలి కోసం ఇప్పటి వరకు రూ.4.50లక్షలు ఖర్చుచేశానని వాటిని వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని అందులో కోరాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.