విషాదం: ఐదుగురు కుమార్తెల‌తో క‌లిసి రైలు కింద ప‌డి మ‌హిళ ఆత్మ‌హ‌త్య

Chhattisgarh woman jumps infront of train with 5 kids.క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 10:14 AM IST
విషాదం: ఐదుగురు కుమార్తెల‌తో క‌లిసి రైలు కింద ప‌డి మ‌హిళ ఆత్మ‌హ‌త్య

క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. భ‌ర్త తిట్టాడ‌నో, ప్రేయ‌సి మాట్లాడం లేద‌నో వంటి చిన్న చిన్న కారణాల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అర్థరాత్రి గొడ‌వ జరిగింది. ఆవేశంలో భార్య త‌న న‌లుగురు కుమారైల‌ను తీసుకుని స‌మీపంలోని రైల్వే ప‌ట్టాల‌పైకి వెళ్లి.. వేగంగా వెలుతున్న రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ విషాద ఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలోని మ‌హాస‌ముంద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మహాసముంద్ జిల్లా బెమ్చా గ్రామానికి చెందిన ఉమా సాహు (45)-కేజవ్ రామ్ సాహు భార్యాభర్తలు. వీరికి న‌లుగురు కుమారైలు అన్నపూర్ణ(18), యశోద(16), భూమిక(14), కుంకుం(12), తులసి(10). కేజవ్‌ రామ్‌ సాహు పొరుగూరు ముధెనాలోని రైస్‌ మిల్లులో కార్మికుడు పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కేజవ్‌రామ్‌ ఇంటి ఖర్చుల విషయమై భార్య ఉమా సాహుతో గొడవపడ్డాడు. అనంత‌రం అత‌డు నిద్ర పోయాడు. అయితే.. గొడ‌వ కార‌ణంగా తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆమె పిల్ల‌ల‌ను తీసుకుని అదే రోజు రాత్రి ఆగ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న బేల్ సొండా రైల్వే జంక్షన్‌‌కు వెళ్లింది.

వేగంగా వస్తున్న రైలు కిందకు పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గురువారం ఉద‌యం గుర్తించిన కొంద‌రు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా..కనిపించకుండాపోయిన తన భర్య, కూతుళ్ల కోసం బుధవారం రాత్రే వెదికాననీ, ఉదయానికల్లా వారు తిరిగి వస్తారని భావించినట్లు కేజవ్‌ సాహు పోలీసులకు తెలిపాడు.

Next Story