హైవేపై 2 కి.మీ రాంగ్‌రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి

కారు రివర్స్ లో రావడం వలన ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

By News Meter Telugu  Published on  19 July 2023 9:00 PM IST
Car Wrong Route, Accident, one Dead, Ghaziabad,

హైవేపై 2 కి.మీ రాంగ్‌రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి

నేషనల్ హైవే పై వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఘజియాబాద్‌లోని జాతీయ రహదారి (NH9)పై కారు రివర్స్ లో రావడం వలన ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని అసోటెక్ సొసైటీలో నివసించే 21 ఏళ్ల కృష్ణంశు చౌదరిగా గుర్తించారు. నివేదికల ప్రకారం, కృష్ణాంశును ఢీకొట్టడానికి ముందు డ్రైవర్ కారును 2 కిలోమీటర్లు రాంగ్‌ రూట్‌లో నడిపాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారు మీరట్‌కు వెళుతుండగా.. మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలోకి ప్రవేశించాల్సి ఉంది. డ్రైవర్ అనుకోకుండా జాతీయ రహదారి 9లోకి ప్రవేశించాడు. దాదాపు 2 కి.మీ. ముందుకు వెళ్లిపోవడంతో యు-టర్న్ తీసుకోడానికి అవకాశం లేకపోవడంతో జాతీయ రహదారిపై కారును రాంగ్‌ రూట్‌లోనే నడుపుతూ వచ్చాడు. ఆ సమయంలో స్కూటీపై వస్తున్న కృష్ణాంశును ఢీకొట్టాడు. ఈ ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ద్విచక్ర వాహనాలను మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై అనుమతించరు.. కానీ NH9లో ప్రయాణించవచ్చు. ఎన్‌హెచ్ 9 సమీపంలోని ఇళ్లు, దుకాణాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 279, 304A కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Next Story