ఓ ట్రక్కును బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆ ట్రక్కు ఆ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఈజిప్టులో జరిగింది. అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ తెలిపిన వివరాల మేరకు.. రాజధాని కైరో నుంచి అసియుట్‌కు బస్సు వెలుతుంది.
ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో ట్రక్కు ఆ బస్సును ఢీ కొట్టింది. వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన దక్షిణ ప్రావిన్స్ అస్సియట్ వద్ద చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు ఆయన తెలిపారు. కాగా.. ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. 2019లో జరిగిన రోడ్డుప్రమాదాల వల్ల సుమారు 10 వేల మంది మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరంలో 3480 మంది మరణించారన్నారు.