కూలీలతో వెలుతున్న లారీ, ప్రయాణీకులతో వెలుతున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన మాలీలో చోటు చేసుకుంది. అక్కడి మీడియా తెలిపిన వివరాల మేరకు.. సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైరు పేలడంతో అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
ప్రమాదం దాటికి మృతదేహాలతో పాటు క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
వస్తువులు మార్కెట్ కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్యాసింజర్ బస్సును ఢీకొట్టినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు మీదికి దూసుకెళ్లిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఏటా ఆఫ్రికా దేశాల్లోనే రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా సంభవిస్తున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి లక్ష జనాభాకు 26 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.